Mallapur Model School Problems : వానొచ్చే.. ఇబ్బందులు తెచ్చే... పాఠశాలకు సెలవిచ్చే - జగిత్యాల వార్తలు
Mallapur Model School Problems : జగిత్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో పాఠశాల ముందు పోసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో పాఠశాలకు వెళ్లడానికి దారిలేక విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. వరద తాకిడి ఎక్కువ కావడంతో పలువురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుందని, తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా వంతెన నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక వసతి గృహాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని.. విద్యార్థులకు వంట చేయడానికి వంట శాల లేకపోవడంతో ఆహారం వండటానికి ఇబ్బందిగా ఉంటుందని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోయారు. ఏఎన్ఎమ్ లేక ఆరోగ్యం క్షీణించినప్పుడు చూసుకోవడానికి ఎవ్వరూ ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.