Mailardevpally Fire Accident Today : మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. పరుపుల తయారీ కంపెనీలో మంటలు - పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం
Mailardevpally Fire Accident Today : రాష్ట్రంలో ఎక్కడ చూసినా అగ్నిప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారానికి లేదా కనీసం నెలకొకటైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం వానా కాలంలోనూ ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని టాటా నగర్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.
స్థానికంగా ఉన్న పరుపులు తయారు చేసే కంపెనీలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసి అందులో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దటమైన పొగలు కమ్మేశాయి. దీనితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.