Mahbubnagar Tankbund Mega Drone Show : మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై మెగా డ్రోన్ షో.. చూస్తే ఫిదా కావాల్సిందే.. - తెలంగాణ తాజా వార్తలు
Mahbubnagar Tankbund Mega Drone Show :మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్‌పై అట్టహాసంగా ఏర్పాటు చేసిన మెగా డ్రోన్ ప్రదర్శన పట్టణవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. 450 డ్రోన్లతో దేశంలోనే మొట్టమొదటి సారిగా మెగా డ్రోన్ షో ఏర్పాటు చేసినట్టు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జ్యోతి ప్రజ్వలన చేసి దీనిని ప్రారంభించిన మంత్రి.. పాలమూరు ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలో ఈ ప్రదర్శన చేపట్టినట్లు వివరించారు.
Mega Drone Show Visuals : ట్యాంక్ బండ్‌లోని ఐలాండ్‌పై రంగురంగుల లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ 12 ప్రదర్శనలు కొనసాగాయి. డ్రోన్ షోలో ప్రదర్శించిన చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ, మహబూబ్‌నగర్ చిత్ర పటాలు, కోహినూర్ వజ్రం, అర్బన్ ఎకో పార్క్, పిల్లలమర్రి, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం, ఐటీ టవర్, జోగులాంబ దేవాలయంతో పాటు కేసీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రాలు అబ్బురపరిచాయి. ఈ డ్రోన్ ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన ప్రజలతో ట్యాంక్‌బండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది.