ముంబయిని ముంచెత్తిన వానలు.. సామాన్లన్నీ వరదనీటిలోనే.. కొండచరియల కిందే 84 మంది!
Maharastra Rains : మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రంలో ఉన్న అనేక నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారులన్నీ నదుల్లా తలపిస్తున్నాయి. యావత్మాల్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఇళ్లల్లోకి మోకాల్లోతు వరద నీరు చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. ఆహార పదార్థాలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు.
ముంబయిని ముంచెత్తిన వాన..
Mumbai Rains : ముంబయి నగరాన్ని కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
22కు చేరిన మృతుల సంఖ్య
Landslide Incident : మరోవైపు, రాయ్‌గఢ్ జిల్లాలోని జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్ వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామంలో మొత్తం 48 ఇళ్లు ఉండగా..17 ఇళ్లు కొండచరియల కారణంగా ధ్వంసమయ్యాయి. ఇర్షల్ వాడీ గ్రామంలో 229 మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 24 మంది మృతిచెందగా మరో 10 గాయపడ్డారు. ఇంకో 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా 84 మంది ఆచూకీ తెలియరాలేదు. ఘటన సమయంలో వీరిలో కొంతమంది గ్రామంలో లేరని తెలుస్తోంది. దీంతో కొండచరియల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై సరైన స్పష్టత లేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు.