Mahabubabad Farmers Problems : వాగు దాటితేనే సాగు.. పంట పండించాలంటే అక్కడ రిస్క్ చేయాల్సిందే - Farmers Problem with Akeru Vagu Flood
Mahabubabad Farmers Problems :అన్నదాతల పంటల సాగుకు ఇంకా కష్టాలు తప్పడం లేదు. ఈ ఊళ్లో.. పంట సాగుకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అలా పొలాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడుతూ వాగు దాటుతున్నారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బొడ్డి తండా రైతులు. థర్మాకోల్ డబ్బా సాయంతో నిండుగా ప్రవహిస్తున్న ఏరు దాటుతున్న ఈ రైతు పేరు భూక్యా రాహుల్. బొడ్డి తండా సమీపంలో ఆకేరు వాగు అవతల రెండెకరాల సాగు భూమి ఉంది. ఈయనతో పాటు పకీరా తండాకు చెందిన సుమారు 70 మంది రైతులకు ఆకేరు వాగు అవతల 150 ఎకరాల భూములు ఉన్నాయి. వీరంతా వ్యవసాయ పనులకు వెళ్లాలంటే ఇలా సుమారు 200 మీటర్లు వాగు దాటి పంట పొలాలను చేరుకుంటారు.
Farmers Problem with Akeru Vagu Flood :వాగుపై వంతెన లేకపోవడంతో.. వరద ప్రవాహం ఉన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటితేనే పంట సాగయ్యేది. ప్రస్తుతం ఆకేరు వాగులో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో మహిళలను తండా నుంచి ఆటోలు, ట్రాక్టర్లలో వేరే మార్గంలో 15 కిలోమీటర్లు దూరం నుంచి పంట పొలాలకు తీసుకొని వెళ్తున్నట్లు గ్రామ రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వాగుపై.. ప్రభుత్వం వంతెన నిర్మించి తమ సాగు కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. సాగు నీటి పైపులను వాగు దాటించిన తరువాత.. స్టార్టర్ డబ్బా, ఇతర సామాగ్రిని ఇలా వాగులో ఈదుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానిక రైతు రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం ఒకరినొకరు పట్టుకుని ఇలాగే వెళ్తారని ఆయన తెలిపారు.