Madhuyaskhi Goud on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ వెనకాల మోదీ, కేసీఆర్‌లు ఉన్నారు: మధుయాష్కీ - మధుయాష్కీ గౌడ్ వైరల్ వీడియో
Published : Sep 19, 2023, 2:33 PM IST
Madhuyaskhi Goud on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోదీల పాత్ర ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను వివరిస్తూ ఎల్పీనగర్లో పర్యటించిన ఆయన.. మోదీ, కేసీఆర్, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందన్నారు. బాబుకు బెయిల్ రాకుండా మోదీ,కేసీఆర్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌లో కేసీఆర్ పాత్రపై తమకు పూర్తి స్థాయి సమాచారం ఉందన్నారు. చంద్రబాబు గతంలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. బాబు అరెస్ట్‌పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దిల్లీ మద్యం కేసులో మనీశ్ సిసోదియాను అరెస్టు చేశారు కానీ.. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదన్నారు. ఆంధ్రా సెటిలర్స్ ఓట్ల కోసం ఎల్బీనగర్ ఎమ్మెల్యే మేకతోలు కప్పుకున్న పులిలా వ్యవహరిస్తున్నారని.. సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది చంద్రబాబు, కాంగ్రెస్ దయతోనేనని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు హామీలను ఆరునూరైనా అమలు చేస్తామని తెలిపారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను తెలంగాణ రాజకీయ నేతలు పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత అరికెళ్ల నర్సారెడ్డి పరామర్శించిన వారిలో వున్నారు.