Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...? - khammam mirchi issue today
Low price for Mirchi in Khammam Market : ఖమ్మం మిర్చి మార్కెట్లో ధరల దగా మరోసారి అన్నదాతను నిండా ముంచింది. మంగళవారం రోజున జెండా పాటకు ఏకంగా రూ.5 వేలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేయడంతో మిర్చి రైతులు లబోదిబోమన్నారు. గిట్టుబాటు ధర అందుతుందని కొండంత ఆశతో మార్కెట్ కు వచ్చిన రైతన్నలు..చివరకు మార్కెట్లో సాగుతున్న కొనుగోళ్ల మాయాజాలంతో నష్టాల మూట గట్టుకుని తిరుగు పయనమయ్యారు.
కుంటి సాకులు చూపి ధరలు అమాంతం తగ్గించేస్తున్నారని రైతులు వాపోయారు. కూలీ, రవాణా ఖర్చులు పోగా ఏమీ మిగలడం లేదని ఆవేదన చెందారు. నాణ్యత, తేమ శాతం సాకులు చూపి వ్యాపారులు.. 17 వేల నుంచి 21వేల వరకు మాత్రమే కొనుగోలు చేయటంతో క్వింటాకు 5 వేల వరకు నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్న నమ్మకంతో వస్తే.. ఇక్కడ కొనుగోళ్లు సాగుతున్న తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీరుమున్నీరయ్యారు.