New wed lady Commits Suicide : కలిసి ఉండలేక.. వీడలేక.. తనువు చాలించిన నవవధువు - telangana latest news
Love Couple Commits Suicide In Hanumakonda District : హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాధం నెలకొంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేక.. కన్న తల్లిదండ్రులను ఎదురించలేక.. వేరే వక్తితో తలొంచి తాళి కట్టించుకుంది. నెల తిరగక ముందే మెట్టినింట్లో బతకలేనని నిర్ణయించుకుంది. కలిసి బతకలేనప్పుడు కనీసం కలిసి చనిపోదామని ఇద్దరు ప్రేమికులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబం తీవ్రంగా విలపిస్తోంది.
ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పలేక, నచ్చని పెళ్లి చేసుకొని అక్కడ ఇమడలేక ప్రియుడితో కలిసి ఆత్మహత్య యత్నం చేసి ఓ నవవధువు మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సంఘ మానస (21), కొత్తకొండ గ్రామానికి చెందిన బోదాసు విజయ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలియని తల్లిదండ్రులు మానసకు ఈనెల 11వ తేదీన హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన మరో యువకుడితో పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లిని చేసుకున్నానని కుమిలిపోయిన మానస ఈనెల 19 న ప్రియుడు విజయ్‌తో కలిసి హనుమకొండకు వెళ్లి అక్కడ ఓ గదిలో క్రిమి సంహారక మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మానస మృతి చెందగా ప్రియుడు విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని మరొక ఆసుపత్రికి తరలించారు.