Lokesh Review on TDP State Bandh: టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేశ్ సమీక్ష.. జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు - రాజమండ్రి జైలు
Published : Sep 11, 2023, 5:05 PM IST
Lokesh Review on TDP State Bandh : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) పార్టీ నేతలతో సమీక్షించారు. ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమైన ఆయన.. ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ ( Feed Back) మేరకు తదుపరి ప్రణాళికకు రూపకల్పన చేశారు. బంద్‌కు మద్దతు ఇచ్చి నిరసనల్లో పాల్గొన్న జనసేన (Janasena), సీపీఐ (CPI) కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
పోలీసుల దౌర్జన్యాన్ని ఎదుర్కొని బంద్, నిరసనల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను అభినందించారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసినా క్యాడర్ నిరసనల్లో పాల్గొంది. టీడీపీ చేపట్టిన నిరసనలను అణిచివేసేందుకు, బంద్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని వాడుతోందని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు అరెస్టును యావత్తు రాష్ట్రం ఖండించిందని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరంలో సాయంత్రం 6 గంటలకు నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలు సమీపంలోని విద్యానగర్ విడిది కేంద్రం వద్ద లోకేశ్ మాట్లాడనున్నారు.