Leopard was Trapped in Tirumala Trail: తిరుమలో చిక్కిన మరో చిరుత.. రెండు నెలలలో చిక్కిన ఐదు.. - tirumala news
Published : Sep 7, 2023, 10:07 AM IST
|Updated : Sep 7, 2023, 1:45 PM IST
Leopard was Trapped in Tirumala Trail:తిరుమలలో మరో చిరుతపులి చిక్కింది. అలిపిరి నడకమార్గంలోని ఏడవ మైలు ఏనుగుల ఆర్చ్ వద్ద అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులోకి నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకుంది. దీంతో నడకమార్గంలో జూన్ 23 నుంచి ఇప్పటి వరకు ఐదు చిరుత పులులను అటవీశాఖ అధికారులు బంధించించారు. కెమెరా ట్రాప్స్‌లో చిరుత కదలికలు ఆధారంగా పట్టుబడ్డ చిరుత తరచూ ఒకే ప్రాంతంలో సంచరిస్తుండడంతో.. ఆ ప్రదేశంలో బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ ఐదో చిరుత కూడా చిక్కింది. ఇప్పటికే జూ క్వారంటైన్లో మూడు చిరుతలు ఉండగా.. తాజాగా పట్టుబడ్డ చిరుత నుంచి సెలైవా, రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు.
అధికారులు ఆ నమూనాలతో బాలిక లక్షిత శాంపుల్స్‌తో క్రోడీకరించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా బాలిక లక్షితను దాడి చేసి చంపింది ఏ చిరుత అనేది అధికారికంగా అటవీశాఖ ప్రకటించలేదు. చిరుత బోనులోకి చిక్కిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. రెండు నెలల వ్యవధిలో ఐదు చిరుతలను అటవీశాఖ బంధించడం సామాన్య విషయం కాదని అన్నారు. ఆత్మస్థైర్యం కోసం అలిపిరి నడకదారి భక్తులకు నిన్నటి నుంచి చేతికర్రలు అందిస్తున్నామని.. ఎవరెన్ని విమర్శలు, ట్రోల్స్ చేసినా తాము పట్టించుకోమన్నారు. చిరుతపులుల సంచారంపై అటవీశాఖ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని.. నడకమార్గానికి సమీపంలో తిరిగే చిరుతలను బంధించడానికి 300 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.