ఆస్పత్రిలోకి దూరి చిరుత బీభత్సం- 4 గంటలు శ్రమించి బంధించిన సిబ్బంది - నాశిక్‌లో చిరుత బీభత్సం
Published : Dec 13, 2023, 10:19 AM IST
Leopard Entered a Hospital in Nashik :మహారాష్ట్ర నాశిక్‌లోని శహాదా పట్టణంలో ఓ చిరుత బీభత్సం సృష్టించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఆస్పత్రిలోకి ప్రవేశించింది. ఫలితంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన డొంగర్‌గావ్ రోడ్డులోని ఆదిత్య ఆస్పత్రిలో మంగళవారం ఉదయం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది చిరుతను గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పత్రిలోని అన్ని గదుల తలుపులను మూసివేశారు. చిరుతను ఓ గదిలో బంధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను సురక్షితంగా పట్టుకున్నారు. ఆస్పత్రిలోకి చిరుత వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీగా అక్కడికి వచ్చారు. చిరుతను బంధించే క్రమంలో స్థానికుల హడావుడితో దానిని పట్టుకోవడం కష్టంగా మారింది. సుమారు నాలుగు గంటలు శ్రమించి అటవీ అధికారులు సురక్షితంగా చిరుతను బంధించడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.