కోర్టు ఆవరణలో లాయర్ల 'గ్యాంగ్‌వార్'.. గన్‌తో కాల్చి.. - దిల్లీ కోర్టు లేటెస్ట్ న్యూస్
Delhi Court Firing Today : దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు గొడవపడి.. గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని దిల్లీ ఉత్తర మండల డీసీపీ సాగర్ సింగ్ కల్సి చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు ఆయన వివరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. న్యాయవాదుల్లో రెండు వర్గాల మధ్య గొడవే కారణమని గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందన్న పోలీసులు.. కాల్పులు జరిపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు జరిగాయి. ఓ వ్యక్తి సాకేత్ కోర్టులో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళకు బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సాకేత్ కోర్టుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల సమయంలో మహిళ తన న్యాయవాదితో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని.. సస్పెండ్ అయిన లాయర్‌గా గుర్తించారు. డబ్బు విషయంలో గొడవ వల్లే నిందితుడు.. బాధితురాలిపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.