Lanco Hills Young Woman Suicide Case Update : లాంకోహిల్స్ యువతి ఆత్మహత్య కేసు.. 'పూర్ణచందర్‌కు సినీ పరిశ్రమతో సంబంధాలు లేవు' - లాంకోహిల్స్ యువతి ఆత్మహత్య కేసు
Lanco Hills Young Woman Suicide Case Update : హైదరాబాద్ మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్‌లో 21వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన బిందుశ్రీ కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పోలీసులు తెలిపారు. 'ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచందర్రావు బంజారాహిల్స్ కేంద్రంగా హోమ్ థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. తన కుమార్తెకు కేర్ టేకర్‌గా కాకినాడకు చెందిన బిందుశ్రీ 7 ఏళ్లుగా పని చేస్తోంది. ఈ క్రమంలో పూర్ణచందర్‌కు, బిందుశ్రీకి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వీరి విషయం పూర్ణచందర్ భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వివాదం జరగడంతో.. మనస్తాపం చెందిన బిందు 21వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది' అని పోలీసులు వెల్లడించారు.
'ఈ నెల 12 తెల్లవారుజామున ల్యాంకో హిల్స్‌లోని 21వ అంతస్తు నుంచి దూకి బిందుశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఏడేళ్లుగా పూర్ణచందర్ ఇంట్లో కేర్ టేకర్‌గా బిందుశ్రీ పని చేస్తోంది. ఈ క్రమంలో పూర్ణచందర్, బిందుశ్రీ మధ్య చనువు పెరిగింది. బిందుశ్రీతో చనువు గురించి పూర్ణచందర్ భార్యకు తెలిసింది. దాంతో పూర్ణచందర్ వేధింపులు తాళలేకే బిందుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణచందర్‌పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశాం. సినీ పరిశ్రమకు పూర్ణచందర్‌కు సంబంధాలు లేవు. నిందితుడు హోమ్ థియేటర్ బిజినెస్ చేస్తుంటాడు' అని రాయదుర్గం సీఐ మహేశ్ తెలిపారు.