Lal Darwaja Bonalu Rangam 2023 : 'ప్రజల పాపాల వల్లే వర్షాలు సకాలంలో పడటం లేదు'
Laldarwaja Simhavahini Bhavishyavaani : హైదరాబాద్ పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళీ అమ్మవారి బోనాల్లో రంగం ప్రత్యేకతను సంతరించుకుంది. మాతంగి అనురాధ భవిష్యవాణిని వినిపించారు. ప్రజలు చేసుకుంటున్న పాపాల వల్లే వర్షాలు సకాలంలో పడటం లేదని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆశీర్వదించారు. అనంతరం అంబారిపై శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ప్రారంభమైంది. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ జెండా ఊపి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఘటాలు ఉరేగింపులో డప్పులు, వాయిద్యాలు, ప్రత్యేకంగా తయారుచేసిన భారీ విగ్రహాలతో కళాకారుల బృందాలతో అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగింది. అమ్మవారి ఘటం ఊరేగింపు హరి బౌలి, లాల్ దర్వాజ క్రాస్ రోడ్, షా అలీ బండ, చార్మినార్ మీదుగా గుల్జార్ హౌజ్, నాయపుల్ దిల్లీ దర్వాజ వరకు సాగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండుగ బోనాల ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో చేపట్టిన అంబారిపై అమ్మవారి ఊరేగింపునకు చార్మినార్ వద్ద మంత్రి తలసాని ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఛైర్మన్ ఆలే భాస్కర్‌రాజ్ మంత్రికి త్రిశూలాన్ని అందజేశారు. ఉప్పుగూడలో తల్వార్ టిల్లు యాదవ్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపును మంత్రి తలసాని ప్రారంభించారు.