యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు
Laksha Pusparchana to Sri Lakshmi Narasimha Swamy at Yadadri Temple: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారులకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేపట్టారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ఆలయ ముఖమండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం లక్ష పుష్పార్చన పూజలు చేశారు. వేదపండితులు వేద మంత్రోచ్ఛారణ చేత, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు పండితులు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు.
యాదాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ శివాలయంలో సీతారామల కల్యాణం జరిగింది. లోకకల్యాణం కోసం ఇరువురు ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేదపండితులు ప్రవచించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించడానికి భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు పంపిణీ, ప్రసాద వితరణ చేశారు. ఈ మహోత్సవానికి ఆలయ ఈఓ గీత, తదితరులు పాల్గొన్నారు.