Lake Front Park in Hyderabad : లేక్‌ఫ్రంట్ పార్క్‌కు సందర్శకుల తాకిడి.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వాక్ వే - లేక్‌ఫ్రంట్ పార్కు టైమింగ్స్
Published : Oct 4, 2023, 11:52 AM IST
Lake Front Park in Hyderabad : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో సరికొత్త సొబగులతో ఇటీవలే ప్రారంభమైన లేక్‌ఫ్రంట్ పార్క్‌కు.. సందర్శకుల తాకిడి మొదలైంది. జలవిహార్‌కు సమీపంలో పచ్చని ప్రకృతి మధ్య 26కోట్ల రూపాయలతో 10ఏకరాల విస్తీర్ణంలో హెచ్ఎమ్డీఏ ఈ పార్క్‌ను నిర్మించింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్క్ అందుబాటులో ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ తరహాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్‌వే అందరినీ ఆకట్టుకుంటోంది. రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగు జిలుగులతో కనువిందు చేస్తోంది.
వాకింగ్ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఉదయం 5 గంటల నుంచి 9వరకు సమయం కేటాయించి వారి నుంచి నెలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఉన్న చెట్లకు స్కానర్‌ను ఏర్పాటు చేసి.. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే వెసలుబాటును కలిగించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. వివిధ రకాలైన 4లక్షల మొక్కలతో పచ్చదనాన్ని రూపొందించారు. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ గదులు, శౌచాలయాల వంటి సకల సౌకర్యాలను కల్పించింది. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ సాగర్‌కు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా.. తమకెంతో ఆహ్లాదాన్నిస్తుందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.