BRS MLA Counter to Bandi Sanjay : 'మీరు భూమి తీసుకురండి.. మేం ఇళ్లు కడతాం'
BRS MLA Counter to Bandi Sanjay : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం పథకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్‌ల కోసం అందజేసిన నిధులను దుర్వినియోగం చేశారన్న బండి ఆరోపణలను ఖండించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని లిఖితపూర్వకంగా నిరూపించగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలాలను డబుల్‌బెడ్ రూమ్‌లకు ఇస్తే కట్టించే బాధ్యతను తాము తీసుకుంటామని బండి సంజయ్‌కు ఎమ్మెల్యే కృష్ణారావు బహిరంగ సవాల్ విసిరారు.
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా.. మరోవైపు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇప్పటి వరకు కరీంనగర్‌కు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించారో చెప్పగలరా అంటూ ఎమ్మెల్యే బండి సంజయ్‌కు ఛాలెంజ్ విసిరారు. కూకట్పల్లి నియోజకవర్గ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం తక్కువగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములు 900 ఎకరాలు ఉన్నాయని.. కేంద్రంతో చర్చించి ఆ భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా అని ప్రశ్నించారు. ఆ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి తాము ప్రజల పట్ల ఉన్న బాధ్యతను నెరవేర్చుకుంటామని చెప్పారు.