యాదాద్రిలో 'మెట్ల మెట్టుకు పతనర్తనం'.. కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారులు
Kuchipudi dance in Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి జన్మదిన నక్షత్రం సందర్భంగా 'మెట్ల మెట్టుకు పతనర్తనం' నానుడిగా స్వామివారి కీర్తనలతో 'భవనాలయ సంగీత నృత్య' అకాడమీకి బృందం కూచిపూడి నృత్యాలు చేసింది. నాట్యమాడుతూ.. 405 మెట్లు ఎక్కిన బృందం స్వామివారి ముఖ మండపాన్ని చేరుకుంది. మెట్లపై తెలుగు సంప్రదాయాన్ని ప్రదర్శిస్తూ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఆలయ వైకుంఠ ద్వారం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారిని దర్శించుకున్నారు.
మరోవైపు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని.. ఆలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి.. పాలు, పెరుగుతో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ.. నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్లైన్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రాభివృద్ధిలో ఆలయ పునర్ నిర్మాణమయ్యాక అంచెలంచెలుగా ఈ సేవలు విస్తరించాయి. ఈ సేవలతో దూర ప్రాంతాల భక్తులకు స్వామి వారి దర్శనం చాలా సులభంగా అందుతోంది. బ్రహ్మోత్సవాల టికెట్లకు సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను పొందలంటే మరిన్ని వివరాల కోసం 'yadadritemple.telangana. gov.in అనే వెబ్సైట్లో చూడవచ్చు.