KTR Latest Comments : 'కేంద్రం సహకరించకపోయినా.. తెలంగాణ నేడు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది' - ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సెమినార్
KTR Speech at MCR HRD Seminar : మోదీ సర్కార్ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని... విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని 'కొత్త రాష్ట్రం ఎదుర్కొనే సవాళ్లు' అనే అంశంపై ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయన్న కేటీఆర్... ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామన్న ఆయన.. ఐటీ రంగంలో పురోగతి సాధించామని తెలిపారు. 'కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది. తెలంగాణను దేశం అనుసరిస్తోంది. త్వరలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది, సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధే తెలంగాణ మోడల్. నీతి ఆయోగ్ సూచనలను సైతం కేంద్రం పట్టించుకోలేదు' అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.