'దిల్లీ దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా' - Telangana Political News
Published : Nov 5, 2023, 9:53 PM IST
KTR Serious Comments on Congress : కొత్త కొత్త రూపాల్లో వస్తున్న కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాలని.. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై వాగ్బాణాలు సంధించారు. ఉన్న తెలంగాణను ఊడకొట్టి.. తెలంగాణ ప్రజలను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీనే అంటూ.. కేటీఆర్ ధ్వజమెత్తారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు తెలంగాణను తుంగలో తొక్కేందుకే కుట్రలు చేశారు కానీ అభివృద్ధి మాత్రం కాదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు చాలా మంది తెలంగాణ ద్రోహులు ఏకమయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుని బీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు దిల్లీ దొరలకు.. 4 కోట్ల ప్రజల మధ్య జరుగుతున్న సంగ్రామంగా అభివర్ణించారు. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని కాాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారని.. ఆయన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానన్నారు. దిల్లీ దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో డిసెంబర్3న తేలుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.