'70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌దే' - కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
Published : Nov 26, 2023, 5:33 PM IST
|Updated : Nov 26, 2023, 5:43 PM IST
KTR Roadshow Campaigns in Telangana :హస్తం పార్టీ రైతుబంధును అడ్డుకోవాలని చూసినా.. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లను జమ చేసిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం, లేనివారికి కొత్త రేషన్‌కార్డులిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వరుస రోడ్‌షోలో పాల్గొన్న కేటీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని.. కర్ణాటకలో ఇచ్చిన హామీలనే ఇంతవరకూ కాంగ్రెస్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలనే ఆశతో కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ఏడ్చే వారిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బీసీ బిడ్డ గొంతు కోసి నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని మంత్రి ఆరోపించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేసిన మంత్రి.. నరసాపూర్ నియోజకవర్గంలో నుంచి సునీత రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గానికి ఐటీ హబ్ పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.