త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం ఉంటుంది : కేటీఆర్
Published : Jan 18, 2024, 7:47 PM IST
KTR Meeting with BRS MLCs : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో ఆయన సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీల పాత్ర, కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరపున ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కళ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని కోరారు. శాసనమండలి సభ్యులు ఇప్పటికే ఎంపిక చేసుకున్న తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
BRS Party Cadre Meeting at Telangana Bhavan : పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత క్రియాశీలం చేస్తామని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని, వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీల సమావేశం ఉంటుందని, అందులో శాసనమండలి పార్టీ నేతను ఎన్నుకుంటారని కేటీఆర్ తెలిపారు.