KTR Emotional Video : ఎమోషనల్ అయిన కేటీఆర్.. సాయిచంద్‌ను తలుచుకుంటూ కంటతడి - గుర్రంగుడలో సాయిచంద్ మృతదేహం
KTR Emotional on Sai Chand : గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి.. సాయిచంద్ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సంతాపం ప్రకటించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్ తండ్రి, ఆయన భార్యకు ధైర్యం చెప్పారు. సాయిచంద్‌ను తలుచుకుని వారు రోదిస్తున్న తీరుతో మంత్రి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం అక్కడి నుంచి బయటకొచ్చిన మంత్రి.. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. 'తెలంగాణ ఉద్యమంలో తన గాత్రంతో అలరించిన సాయిచంద్ మరణం చాలా బాధాకరం. సాయిచంద్ పాట వినని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు. 38 ఏళ్ల సహచరుడు సాయిచంద్ మరణం తీరని లోటు. హైదరాబాద్‌లోనే ఉంటే బతికేవాడేమో. స్వగ్రామానికి వెళ్లడంతో అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. వారి కుటుంబసభ్యులను ఓదార్చే పరిస్థితి మాకెవ్వరికీ లేదు. సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా'మంటూ కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకుంటూ అక్కడి నుంచి కదిలారు.