షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి.. భయంతో కిందకు దూకి.. - ఛత్తీస్‌గఢ్‌లో అగ్ని ప్రమాదం
Korba Fire Accident : ఛత్తీస్‌గఢ్ కోర్బాలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగడం వల్ల ముగ్గురు మృతి చెందారు. దుకాణాల్లో చిక్కుకున్న ప్రజలు భయభ్రాంతులకు గురై మెుదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. కొందరు వ్యక్తులు మంటల పక్క నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది
రెండంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలు చెలరేగాయి. వస్త్ర దుకాణం నుంచి మొదలైన దట్టమైన పొగ, అగ్నికీలలు కొద్ది క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఈ భవన సముదాయంలో ఓ జాతీయ బ్యాంక్ శాఖ, వస్త్ర దుకాణంతో పాటు పలు దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వస్త్ర దుకాణంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో 12కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. మెుదట బ్యాంక్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల ధాటికి 17 మంది గాయపడగా.. ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారని కలెక్టర్ సంజీవ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.