నల్గొండలో గత ఐదేళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క : మంత్రి కోమటిరెడ్డి - మంత్రి కోమటిరెడ్డి లేటెస్ట్ న్యూస్
Published : Dec 18, 2023, 4:32 PM IST
Komati Reddy Welcome Program in Nalgonda :మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నల్గొండకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించారు. భారీ ర్యాలీతో నల్గొండలోని నివాసానికి చేరుకున్న మంత్రికి, పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐదోసారి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు.
నల్గొండ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని ఆయన పలికారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని, సిరిసిల్ల,సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. నల్గొండలో గత ఐదేళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీ పథకాలు అన్ని త్వరలోనే అమలు చేస్తామని ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు.