కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలి : కోదండరాం - కొదండంరాం లెటెస్ట్ కామెంట్స్
Published : Dec 15, 2023, 2:11 PM IST
Kodandaram in Bhupalpally Singareni Election Campaign : కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ, కార్మికుల కష్టాన్ని వృథా చేశాయని ఆరోపించారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి గనులు, ఓపెన్ కాస్ట్‌లు, జీఎం కార్యాలయం, వర్క్ షాప్, ఏరియా ఆస్పత్రుల్లో ఆయన పర్యటించారు. ఆరో గని వద్ద కార్మికులతో జరిగిన గేట్ మీటింగ్‌కు హాజరైన కోదండరాం హెచ్ఎంఎస్ను గెలిపించాలని కోరారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. హెచ్ఎంఎస్ గెలిస్తేనే కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.
ఈ క్రమంలోనే సింగరేణి ప్రైవేటీకరణ, ఓపెన్ కాస్ట్లను రద్దు చేయాలని పలుమార్లు ఉద్యమం చేసినప్పటికీ, ప్రైవేటు వ్యక్తులకు సింగరేణి కార్మికుల కష్టాన్ని లాభాలకు అమ్ముకుంటున్నారని కోదండరాం మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే హెచ్ఎంఎస్ను సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలిపించాలని కార్మికులను కోదండరాం కోరారు.