Kodandaram Fires on CM KCR : 'రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. విధ్వంసం చేసింది'
By Telangana
Published : Sep 1, 2023, 10:04 PM IST
Kodandaram Fires on CM KCR: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాలను అణచివేసి.. డబ్బుతో గెలవాలని చూస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ లేకపోయినా.. అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పింఛన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాద్ ధర్నాచౌక్లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యను నిర్లక్ష్యం చేసిందని కోదండరాం విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాల్లో ఐక్యత లేదన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడానికి తప్ప.. పోరాటాలకు సిద్ధంగా లేవని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. విధ్వంసం చేసిందని విమర్శించారు.
బంగారు తెలంగాణ అంటే బడుగులకు విద్యను దూరం చేయడమేనా అని పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొ.హరగోపాల్ ప్రశ్నించారు. ఉద్యోగుల కుటుంబాలకు శాపంగా మారిన కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్దిరించాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్లు ఎలా అయితే పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించాయో.. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలన రాజ్యాంగబద్ధంగా సాగాలని.. నిధులు కూడా అదేవిధంగా కేటాయింపు చేయాలన్నారు.