176 కేజీల 'కింగ్' మేక.. రూ.12 లక్షలకు సేల్.. యజమానికి జాక్‌పాట్! - అత్యధిక బరువున్న మేక ఏది
King Goat Indore : సాధారణంగా మేక ధర రూ.వేలల్లో ఉంటుంది. అలాగే దాని బరువు కూడా ఒక క్వింటాల్ లోపే. మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో 43 అంగుళాలు ఉన్న ఓ మేక మాత్రం 176 కిలోల బరువు ఉంది. ఈ మేకను అమ్మకానికి పెట్టగా రూ.12 లక్షలకు అమ్ముడుపోయింది. దీంతో ఒక్కసారిగా మేక ఇంత రేటా? అని ఆశ్చర్యపోయారు అక్కడి ప్రజలు.
అసలేంటీ ఈ మేక కథ..
సుహైల్ అహ్మద్ అనే వ్యక్తికి మేకల పెంపకం అంటే చాలా ఇష్టం. అతడు 8 నెలల కిందట రాజస్థాన్‌లో ఓ మేకను కొనుగోలు చేశాడు. దానిని అల్లారుముద్దుగా పెంచాడు. ఆ మేకను బక్రీద్ సందర్భంగా అమ్మకానికి పెట్టగా భారీ ధర పలికింది. 'నేను పెంచుకున్న మేకకు ముద్దుగా 'కింగ్' అని పేరు పెట్టా. ఈ కోటా జాతికి చెందిన ఈ మేక బరువు దాదాపు 176 కిలోలు ఉంటుంది. రూ.12 లక్షలకు ముంబయికి చెందిన ఓ వ్యక్తి 'కింగ్'ను కొనుగోలు చేశాడు. మేక వేసవిలో వేడిగాలుల నుంచి తట్టుకునేందుకు రెండు కూలర్లు ఏర్పాటు చేశాను. దానికి ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించేవాడ్ని. షెడ్ ఏర్పాటు చేసి అందులోనే కింగ్‌ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. 8నెలల క్రితం రాజస్థాన్‌లో 'కింగ్'ను కొనుగోలు చేశా. దానికి శనగలు, గోధుమలు, పాలు, ఖర్జూరం వంటి పదార్థాలను ఆహారంగా పెట్టాను' అని సుహైల్ అహ్మద్ తెలిపారు.