Bhadrachalam Godavari Drone video : భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి.. డ్రోన్ విజువల్స్ చూశారా..? - Bhadrachalam latest news
Godavari Water level Bhadrachalam Today : ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ఉద్ధృతితో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉప్పొంగుతున్న వాగులతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బీభత్సం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 1000 ఇళ్లను ఖాళీ చేయించారు. 10 పునరావాస కేంద్రాలు తెరిచి.. దాదాపు 4 వేల మంది వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పంచారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 3500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఓవైపు జిల్లాలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటిమట్టం 47 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వాజేడు వెంకటాపురం ముంపు మండలాలైన కూనవరం విఆర్ పురం చింతూరు కుకునూరు వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటిమట్టం పెరగడంతో భద్రాచలం దుమ్ముగూడెం చర్ల మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.