చాందీ అంతిమయాత్రకు పోటెత్తిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్.. 'మిస్ యూ తాత' అంటూ ప్లకార్డులు - ఊమెన్ చాందీ వయసు
Oommen Chandy Funeral : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. కొల్లాం నుంచి కొట్టాయం వరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు. ఊమెన్ చాందీ పార్థివదేహాన్ని చూసేందుకు రోడ్డు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఊమెన్ చాందీ అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 'చాందీ చనిపోలేదు.. అతను మనలో జీవించి ఉన్నారు', 'ఆయన లాంటి మరొక నాయకుడు ఇంకొక లేరు' వంటి నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. గురువారం ఊమెన్ చాందీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఏఐసీసీ ట్వీట్ చేసింది.
అలాగే పతనంతిట్టలో ఓ చిన్నారి రోడ్డు పక్కన యూనిఫాంలో నిల్చొని.. 'ఐ లవ్ యూ చాందీ తాత.. మిమ్మల్ని మిస్ అవుతున్నా' అని ప్లకార్డును పట్టుకుని కనిపించింది. మరోవైపు.. చాందీ పార్థివదేహానికి కొట్టాయంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సినీ నటులు మమ్ముట్టి, సురేశ్ గోపీ నివాళులర్పించారు. చాందీ పార్థివదేహాన్ని తీసుకొచ్చే వాహనం బెంగళూరు నుంచి కొట్టాయంకు 24 గంటలు ఆలస్యంగా వచ్చింది.
Oommen Chandy Death : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఊమెన్ చాందీ(79) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.