తెలంగాణ

telangana

Kedarnath Dham

ETV Bharat / videos

తెరుచుకున్న కేదార్​నాథ్​.. తొలి పూజ మోదీ పేరు మీదే.. భక్తులపై పూల వర్షం - Kedarnath first day

By

Published : Apr 25, 2023, 5:04 PM IST

శివ నామస్మరణ మధ్య కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఛార్‌ధామ్‌లలో ఒకటైన 12 వందల ఏళ్ల చరిత్ర కలిగిన కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులను మంగళవారం ఉదయం 6.20 గంటలకు ప్రధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమాశంక‌ర్ లింగ శివాచార్య తెరిచారు. ఓ వైపు భారీగా మంచు కురుస్తున్నా.. వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి చూశారు. భారీగా మంచు కురుస్తుండడం వల్ల యాత్రికులను ముందుకు వెళ్లకుండా నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం మెరుగుపడే వరకు యాత్రికులు రిషికేశ్, గౌరీకుండ్, గుప్తకాశీ సోన్‌ప్రయాగ్‌లలో వేచి ఉండాలని కోరారు. ఇప్పటికే కేదార్‌నాథ్ చేరుకున్న కొంతమంది భక్తులు ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమాన్ని తిలకించారు.  

కేదారనాథుడిని దర్శించుకున్న సీఎం..
కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకున్న మొదటిరోజు.. ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ ధామి కేదార్​నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ పేరు మీద తొలి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం అక్కడే డప్పులు వాయిస్తున్న కళాకారులతో ముచ్చటించారు. కాసేపు సరదాగా డప్పులు వాయించారు. 

భక్తులపై పూల వర్షం..
కేదార్‌నాథ్‌ ఆలయాన్ని 35 క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు అధికారులు. అయితే కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే సమయంలో భక్తులపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. దీంతో భక్తులు పులకించిపోయారు. ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి ఆదేశాల మేరకు చరిత్రలో తొలిసారిగా పూల వర్షం ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

స్వల్ప తోపులాట.. 
అయితే ఆలయ తలుపులు తెరిచే సమయంలో పెను ప్రమాదం తప్పింది. కొందరు భక్తులు ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా అక్కడికక్కడే మోహరించిన పోలీసులు భక్తుల తోపులాటలను నిలువరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఎలాంటి ప్రమాదం జరుగకుండా చుశారు. 

ABOUT THE AUTHOR

...view details