50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని పదేళ్ల పాలనలో పోగొట్టాం : కేసీఆర్
Published : Nov 26, 2023, 6:55 PM IST
KCR Praja Ashirvada Sabha at Vemulawada : 50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని పదేళ్ల పాలనలో పోగొట్టామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. పదేళ్ల తెలంగాణ ప్రగతిని వివరిస్తూనే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజన్న ప్రతి ఒక్కరి ఇంటి ఇలవేల్పు అన్న కేసీఆర్.. భక్తుల కోసం కాటేజ్‌లు కడతామన్నారు. అదేవిధంగా కలికోట సూరమ్మ చెరువు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్.. కేవలం బీఆర్ఎస్ గాలి మాత్రమే వీస్తోందని చెప్పారు. మరోసారి భారీ మెజార్టీతో గులాబీ పార్టీ అధికారం చేపట్టబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. మళ్లీ హస్తం పార్టీ వస్తే బతుకులు ఆగం ఆవడం ఖాయమని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు కౌలుదారులకు ఇస్తామని అంటోందని హెచ్చరించారు. కౌలుదారు రెండు, మూడేళ్లు సాగుచేస్తే.. రైతు భూమి గోల్‌మాల్ అవుతుందని తెలిపారు. మళ్లీ రైతులు తమ భూమి కోసం.. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని.. అందుకే ప్రజలు ఆలోచించి.. ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.