అట్టహాసంగా కార్తీక దీపం వేడుక- 80 అడుగుల ఎత్తులో జ్యోతి ప్రజ్వలన! - 80 అడుగుల నిర్మాణంపై కార్తీక దీపం
Published : Nov 28, 2023, 1:19 PM IST
|Updated : Nov 28, 2023, 1:34 PM IST
Karthika Deepam Festival In Tamilnadu :కార్తీక దీపం పండగను పురస్కరించుకుని తమిళనాడు నీలగిరిలోని నంజానాడ్ గ్రామంలో ఓ 450 ఏళ్ల చరిత్ర ఉన్న గిరిజన తెగ అట్టహాసంగా వేడుకను నిర్వహించింది. ఈ ఉత్సవంలో 350 గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ వేడుకలో సంప్రదాయ గిరిజనుల నృత్యం చేస్తూ పాటలు పాడారు. వేడుకలో గిరిజన తెగకు చెందిన ఓ పెద్ద 80 అడుగుల ఎత్తునున్న నిర్మాణంపైకి ఎక్కి జ్యోతిని వెలిగించారు. సోమవారం జరిగిన ఈ వేడుకకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై.. ఎంతో ఆసక్తిగా జ్యోతి ప్రజ్వలను వీక్షించారు.
2,668 అడుగుల ఎత్తైన కొండపై..
ఇటీవల కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 26న తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయంలో తిరుకార్తికై దీపోత్సవం వేడుక కూడా కన్నులపండువగా జరిగింది. ఏటా జరిగే ఈ పండగ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈనెల 17న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం కాగా.. నవంబరు 26న ముగిశాయి. చివరిరోజున 2,668 అడుగుల ఎత్తైన కొండపై మహా దీపాన్ని వెలిగించారు అర్చకులు. ఆ మరుసటి రోజు ఉదయం అన్నామలైయర్ ఆలయంలో పారాణి దీపం వెలిగించారు.