ఉచిత బస్ ప్రయాణం కోసం కక్కుర్తి.. బుర్ఖా ధరించి దొరికిపోయిన వ్యక్తి - కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం
బస్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలాగా 'బుర్ఖా' వేసుకున్నాడు ఓ వ్యక్తి. తాను మహిళనని నమ్మించేందుకు ఓ నకిలీ ఆధార్ కార్డ్ సైతం సృష్టించాడు. అతడిపై అనుమానం కలిగి 'బుర్ఖా' తొలగించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
ధార్వాడ్ జిల్లా.. కుంద్‌గోల్ తాలూకా పరిధిలో ఉన్న సాన్సి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్‌స్టాండ్‌లో గ్రామస్థులు, ప్రయాణికులు బస్ కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో వీరభద్ర అనే వ్యక్తి కూడా 'బుర్ఖా' వేసుకుని బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'బుర్ఖా' వేసుకున్న వ్యక్తి పట్ల పక్కనున్న వారికి అనుమానం వచ్చింది. దీంతో అతడి 'బుర్ఖా'ను వారు తొలగించారు. దీంతో అసలు విషయం భయపడింది. 'బుర్ఖా' వేసుకుంది మహిళ కాదని.. పురుషుడని తెలిసింది.
దీనిపై వీరభద్రను నిలదీయగా.. తాను విజయపుర జిల్లాలోని సిందగి తాలూకా పరిధిలో ఉన్న ఘోడగేరి గ్రామానికి చెందిన వ్యక్తిగా అతడు చెప్పుకున్నాడు. ఇక్కడికి అడుక్కొవడానికి వచ్చినట్లుగా స్థానికులకు వివరించాడు. వీరభద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడున్నవారు. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కర్ణాటకలోని మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్‌లో ప్రయాణించొచ్చు. దీనికి సంబంధించి శక్తి పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఆధారంగా.. అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC) పరిధిలో నడుపుతున్న బస్‌ల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
TAGGED:
viral video