మోదీ రోడ్‌షోతో ట్రాఫిక్ జామ్.. రహదార్లపై చిక్కుకున్న అంబులెన్సులు - బెంగళూరు ట్రాఫిక్ జామ్ అంబులెన్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నేపథ్యంలో బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులపై బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. జయనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్‌లో చిక్కుకొని రెండు అంబులెన్సులు ఇబ్బంది పడ్డాయి. సైరన్ మోగుతున్నప్పటికీ.. అంబులెన్సుకు ఎవరూ దారి ఇవ్వలేదు. పోలీసులు అక్కడే ఉన్నా.. అంబులెన్సుకు మార్గం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు. దీంతో అంబులెన్సులు పది నిమిషాల పాటు రహదారిపైనే కదలకుండా ఉండిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు అవి అక్కడే నిలిచిపోయాయి. అయితే, మోదీ రోడ్‌షోకు ఆటంకం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ అంబులెన్సులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని శుక్రవారం బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన జరగింది.
కాగా, ప్రధాని మోదీ.. బెంగళూరులో 26.5 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో మెగా రోడ్‌షో చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రోడ్‌షో సాగింది. ముందు జాగ్రత్తగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెంగళూరులోని 34 రోడ్లను మూసివేశారు. వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సైతం మోదీ రోడ్‌షో కొనసాగనుంది.