స్వామీజీకి మొక్కలతో తులాభారం.. పర్యావరణాన్ని కాపాడేందుకు వినూత్న సందేశం - plants tulabhara in mangalore
కర్ణాటకలో స్వామీజీకి మొక్కలతో తులాభారం చేశారు ఓ ఫౌండేషన్ నిర్వాహకులు. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గించేందుకు తమవంతు పాత్రగా ఇలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ కథ..
మంగళూరులో కల్కుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెజావర విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీకి ఏటా నాణేలతో తులాభారం ఇచ్చేవారు. కానీ ఈ సంవత్సరం తులాభారంలో వినూత్నంగా మొక్కలు వినియోగించారు. ఈ తులాభారం కల్కుర సేవ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రదీప్ కుమార్ నివాసంలో జరిగింది. ఈ తులాభారంలో స్థానికంగా పెంచిన మామిడి, వాల్నట్, అశ్వత్థ, జాక్ఫ్రూట్తో పాటు వివిధ రకాల మొక్కలను ఉపయోగించినట్లు ప్రదీప్ కుమార్ తెలిపారు.
" ప్రతి సంవత్సరం ఫౌండేషన్ తరఫున మేము పెజావర స్వామీజీకి నాణేలతో తులాభారం ఇస్తాము. ఈసారి కొత్తగా మొక్కలతో ప్రయత్నించాము. మేము ఒక రోజు కారులో ప్రయాణిస్తుండగా.. నేషనల్ హైవే వద్దకు చేరుకోగానే ఉష్ణోగ్రత పెరగడం గమనించాం. అలాగే ఎక్కువ మొత్తంలో చెట్లు ఉన్న ప్రాంతంలో వాతావరణంలో చల్లదనాన్ని గుర్తించాం. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటాలి అని అర్థమైంది. అందుకే ఈ ప్రయత్నం చేశాం. పూజా కార్యక్రమాల అనంతరం ఈ మొక్కలను భక్తులకు పంపిణీ చేస్తాం" అని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.
'చెట్లతోనే జీవం'
చెట్లు పెంచని వారికి బతికే హక్కు లేదని.. చెట్లు నాటడం వల్ల మనకు నీడ మాత్రమే కాదు, జీవం కూడా లభిస్తుందని పెజావర స్వామీజీ అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమమం చేపట్టిన కల్కుర ఫౌండేషన్ వారిని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.