MLC Kadiyam on Rajaiah : 'ఎమ్మెల్యే రాజయ్య - సర్పంచ్ నవ్య మధ్య వివాదంపై విచారణ జరుగుతోంది'
Kadiyam Comments On Rajaiah, Navya Controversy :రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. ప్రభుత్వ పరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వచ్చిన ఆరోపణల పైన ప్రభుత్వపరంగా విచారణ పూర్తయిన తర్వాత పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య గతంలో ఆరోపణలు చేసింది. దీనిపై వివాదం చెలరేగడంతో రూ.25లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తామని ప్రకటించి ఎమ్మెల్యే రాజయ్య.. నవ్యతో వివాదం పరిష్కరించుకున్నారు. అయితే తాజాగా ఈ నిధుల కేటాయింపుపై ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్యతో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్, ఎంపీపీ కవిత, తన భర్త ప్రవీణ్ పైనా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో ముగిసిపోయిందనుకున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.