Kadem Project Generator Issue : కడెం జలాశయానికి వెంటాడుతున్నసాంకేతిక సమస్యలు.. మొరాయించిన జనరేటర్ - Electricity supply to Kadem reservoir generators
Kadem Project Latest News : నిర్మల్ జిల్లా కడెం జలాశయం వద్ద సాంకేతిక సమస్యల బాధలు తప్పట్లేదు. నాలుగు రోజుల క్రితం జలాశయం వరద గేట్లు మొరాయించడంతో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనపడింది. ఆ అనుభవాలు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. తాజాగా మరో సమస్య ఉత్పన్నమైంది. కడెం జలాశయంకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు ఉపకరించే జనరేటర్ సోమవారం నాడు మరమ్మతుకు గురైంది. వరద గేట్లను ఎత్తేందుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడే వెయ్యి కిలో వాట్ల సామర్థ్యం గల రెండు జనరేటర్లు ప్రాజెక్టుకు ఉన్నాయి. అందులో గేజ్ రూం దగ్గర ఒకటి, ప్రధాన కాలువ దగ్గర ఉన్న పాత జనరేటర్ గదిలో మరొకటుంది. గేజ్ రూం దగ్గర ఉన్న జనరేటర్ మొరాయించడంతో దాన్ని మరమ్మతుకు హైదరాబాద్ తరలించాలని అధికారులు నిర్ణయించారు. పాత జనరేటర్ కొద్దికాలంగా పనిచేయక వదిలేసి ఉంచగా దానికి కావల్సిన పరికరాలు బిగించి బాగు చేయించారు. కొత్తదాన్ని మరమ్మతు చేయించేందుకు మంగళవారం రాత్రి జేసీబీ సహాయంతో గదిలోంచి బయటకు తీసి ట్రాలీ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. అయిదారు రోజుల్లో మరమ్మతు చేయించి తీసుకువస్తామని, పాత జనరేటర్ పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు. వీటికి తోడుగా మరో కొత్త జనరేటర్‌ను 15 రోజుల్లో తెప్పిస్తున్నామన్నారు.