అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా - లేదంటే శపిస్తా: సీఎం జగన్‌కు కేఏ పాల్ వార్నింగ్ - తాడేపల్లి
Published : Jan 9, 2024, 3:23 PM IST
|Updated : Jan 9, 2024, 7:31 PM IST
KA Paul Serious Comments : తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా, లేదంటే శపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఎం జగన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన పాల్‌ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు అంగీకరించక పోవడంతో మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ ఎదురుచూశారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చానని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఇవాళ అంతా వేచి చూస్తానని, అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా, లేదంటే శపిస్తా అని కేఏ పాల్ చెప్పారు. చివరకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఎంతోమంది దేశాధినేతలు తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉండగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గుర్తు చేస్తూ, అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు అని అన్నారు. మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని, రేవంత్ కూడా సీఎం అయ్యాక అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా, అపాయింట్‌మెంట్ ఇస్తే సీఎంతో ముఖ్య విషయాలు చర్చిస్తా అని తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ పేర్కొన్నారు.