KA PAUL Latest News : 'రాష్ట్ర అప్పులు ఎలా తీర్చాలో చర్చించేందుకు ప్రగతిభవన్‌కు వచ్చా' - ప్రపంచ శాంతి మహాసభలు
KA Paul Came to Pragathi Bhavan to Meet KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు ఇతరులను కలవడానికి సమయముంది కానీ తనను కలవలేకపోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆక్షేపించారు. సీఎంను కలవడానికి ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయన.. అపాయింట్‌మెంట్ లేదని పోలీసులు తెలపడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అక్టోబర్ 2న ప్రపంచ శాంతి మహా సభలకు కేసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని వచ్చినట్లు తెలిపారు. తాను కలుస్తానని తమ పార్టీ ఉపాధ్యక్షులు కుమార్ సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులు ఎలా తీర్చాలి.. అభివృద్ది ఎలా చేయాలనే అంశాలపై సీఎంతో మాట్లాడాలనుకున్నట్లు కేఏ పాల్ చెప్పారు.
ఈ క్రమంలోనే ఇతర వ్యక్తులను కలిసేందుకు సుముఖత చూపిన సీఎం.. తనతో కలిసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో తెలియడం లేదని అన్నారు. తాను సీఎంను కలిసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. తన వెంట తెలంగాణలో 70 శాతం ప్రజలు ఉన్నారని.. రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తినని తెలిపారు. కేసీఆర్‌తో కలిసి పని చేసే విధంగా అడుగులు వేస్తున్నానని వివరించారు.