Junagadh SP Raviteja: పోలీస్ బాస్ అంటే ఇలా ఉండాలి..! తెలుగు తేజానికి జై కొట్టిన జునాగఢ్ - జునాగఢ్ ఎస్పీ వాసం శెట్టి రవితేజ
Junagadh SP RaviTeja: సామాన్యుల హక్కుల సంరక్షణ.. శాంతి భద్రతల పర్యవేక్షణే లక్ష్యంగా కొంత మంది పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే.. మరి కొందరు పాలకుల మెప్పు కోసం ఆరాటపడుతున్నారు. అధికార పక్షం ఆడుతున్న రాజకీయ క్రీడలో మమేకమై... అవినీతి, అక్రమాలకు వంత పాడుతూ ఆస్తులు పోగేయడమే పనిగా పెట్టుకున్నారు. తప్పు చేస్తున్న వారిని వదిలేసి బాధితులపైనే ప్రతాపం చూపుతున్న తీరు పట్ల సభ్యసమాజం తల దించుకుంటోంది.
Police Uniformనీతి, నిజాయితీ ఆభరణాలుగా.. జనం గుండెల్లో స్థానం దక్కించుకుంటున్న పోలీసులు అతి కొద్ది మంది మాత్రమే. గుజరాత్ రాష్ట్రంలో ఓ పోలీస్ అధికారి బదిలీ సందర్భంగా చోటుచేసుకున్న సన్నివేశం ఖాకీ యూనిఫామ్‌కు వన్నెతెస్తోంది. పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని వేనోళ్ల చాటుతోంది. ఆ అధికారిని సామాన్య ప్రజలే కాదు.. తన దగ్గర పనిచేసే ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది సైతం గుండెల్లో పెట్టుకున్నారు. తీరా ఆయన బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో.. అడుగడుగునా పువ్వులు చల్లి ఘనంగా వీడ్కోలు పలికారు. రథయాత్రను తలపించేలా.. ఆ అధికారి కారుకు తాళ్లు కట్టి పోలీస్ సిబ్బంది లాగగా.. సామాన్య ప్రజలు, పోలీస్ కుటుంబాలు దారి పొడవునా పూలు చల్లుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గుజరాత్ రాష్ట్రం జునాగఢ్‌లో జరిగిన ఈ పోలీస్ వృత్తి ఔన్నత్యాన్ని చాటగా.. ఆ అధికారి తెలుగు వాడు కావడం విశేషం. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన వాసం శెట్టి రవితేజ.. గుజరాత్‌లోని జునాగఢ్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇటీవల గాంధీనగర్‌కు బదిలీ అయిన సందర్భంగా ప్రజల స్పందించిన తీరుపై వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Police Familyరవితేజ 2019 నుంచి జునాగఢ్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అంతకు ముందు.. మంగరోల్‌లో డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా డిప్యుటేషన్‌పై బాధ్యతలు నిర్వహించారు. మంగ్రోల్‌లో విజయవంతంగా పనిచేయడంతో అక్కడి నుంచి అహ్మదాబాద్‌లో డీసీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జునాగఢ్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన.. గాంధీనగర్ జిల్లా పోలీసు చీఫ్‌గా బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న రవితేజకు జునాగఢ్ జిల్లా పోలీసు కుటుంబంతోపాటు.. జునాగఢ్ వాసులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు సూపరింటెండెంట్‌పై పూలవర్షం కురిపిస్తూ.. కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ఎస్పీ మోటార్‌కార్‌ను తాడుతో లాగి పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.