టోల్ సిబ్బందిపై భాజపా నేత దాడి.. తుపాకీతో హల్చల్!
టోల్ టాక్స్ అడిగినందుకు సిబ్బందిపై దాడి చేశారు భాజపా నేత తిలక్ యాదవ్, ఆయన మద్దతుదారులు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్, ఝాన్సీ జిల్లాలోని శివపురి రహదారిపై ఉన్న రక్షా టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి జరిగింది. భాజపా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా టోల్‌ప్లాజా సిబ్బంది ట్యాక్స్ చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన తిలక్, ఆయన అనుచరులు దాడికి దిగారు. సామగ్రి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపి భయపెట్టారు. దీంతో సిబ్బంది పరుగులు పెట్టారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సమస్యను అదుపులోకి తీసుకొచ్చారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. భాజపా నేత సహా మొత్తం 30 మందిపై శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రక్షా పోలీసులు. భాజపా నేత మద్దతుదారులు టోల్ ప్లాజాలో నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు సిబ్బంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST