Jalna Maratha Reservation Protest : ఆందోళనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం.. 25 మంది పోలీసులకు గాయాలు.. - జాల్నా లాఠీ చార్జ్
Published : Sep 1, 2023, 9:26 PM IST
Jalna Maratha Reservation Protest : మహారాష్ట్ర జాల్నాలో చేపట్టిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం అంతర్వాలీ గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనలో 25 మందికి పైగా పోలీసులు సహా అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆందోళనకారులు తమపైకి రాళ్లు రువ్వారని.. పరిస్థితిని అదుపు చేసేందుకే లాఠీచార్జ్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు పలు రౌండ్ల బుల్లెట్లను సైతం గాల్లోకి కాల్చారని ఆందోళనకారులు చెబుతున్నారు. కానీ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు ఆ వర్గం ప్రజలు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదంటూ.. మనోజ్ జరాంగే అధ్యక్షతన అమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అంతకుముందు బుధవారం దీక్షా స్థలిని సందర్శించిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. ఆందోనకారులతో మాట్లాడారు. దీక్షను విరమించాలని కోరగా.. అందుకు వారు ఒప్పుకోలేదు.