అయోధ్య రాముడికి జలాభిషేకం.. పాక్, ఉక్రెయిన్ సహా 155 దేశాల నీటితో.. - 155 దేశాల పవిత్ర జలాలతో రామమందిరానికి అభిషేకం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏడు ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అయోధ్య రాముడి కోసం నిర్మిస్తున్న రామమందిరం స్థలంలో జలాభిషేకం నిర్వహించారు శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు. ఈ మహాఘట్టంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా 40కి పైగా దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్ సహా రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి సైతం నీటిని తీసుకురావడం విశేషం. అభిషేకానికి ముందు వివిధ దేశాల నుంచి తెచ్చిన జలాలకు మంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. అనంతరం కలశాలలో ఉన్న పవిత్ర నీటిని ఆలయ నిర్మాణ స్థలంలో పోసి అభిషేకం చేశారు. బాబర్ జన్మస్థలమైన ఉజ్బెకిస్థాన్‌లోని ప్రసిద్ధ నది కషక్ నుంచి కూడా నీటిని తేవడం మరో విశేషం. అభిషేకం కోసం వినియోగించిన జలాల్లో మన దేశంలోని పవిత్ర జలాలను కూడా వాడారు. కాగా, వీటిని సేకరించడానికి ట్రస్ట్‌కు రెండున్నర సంవత్సరాల సమయం పట్టిందట. ఈ మొత్తం కార్యక్రమంలో హిందువులే గాక ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీ మతస్థులు కూడా పాలుపంచుకోవడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
వడివడిగా రామమందిర నిర్మాణం..
మరోవైపు అయోధ్యలోని రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా విడుదల చేశారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని రామ మందిరం అభివృద్ధి పనులకు సంబంధించిన అప్డేట్ను భక్తులతో పంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.