సరికొత్త హంగులతో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల.. ఆకట్టుకునేలా డ్రోన్ విజువల్స్ - కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటన
Sircilla Agricultural College Drone Visuals : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో ఈ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు సిద్ధమయ్యాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానున్నాయి.
రాష్ట్రంలో ఈ తరహా హంగులతో కూడిన భవన సముదాయం ఎక్కడా లేదు. వ్యవసాయం రంగానికి సంబంధించిన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో... విద్యార్ధులు వ్యవసాయ విద్యపై చక్కటి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో గత ఏడాది వ్యవసాయ కళాశాల మంజూరైంది. ఇప్పటికే ఒక బ్యాచ్ విజయవంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ విద్యార్థుల సౌకర్యార్థం... సుమారు 73 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో కళాశాల, వసతి గృహాలు, ల్యాండ్ స్కేప్ తదితర నిర్మాణాలు చేపట్టామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ వెల్లడించారు.