Inter Student Suicide in Kamareddy : గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు - గురుకుల హాస్టల్‌లో బాలిక ఆత్మహత్య
Published : Oct 31, 2023, 5:30 PM IST
Inter Student Suicide in Kamareddy :కామారెడ్డి జిల్లా గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గేట్ వద్ద సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసుధ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని సొంత ఊరు బిచ్కుంద మండలం మానేపూర్ అని ప్రిన్సిపల్ తెలిపారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రిన్సిపల్ సవిత తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో విద్యార్థులందరూ ప్రతిజ్ఞకు వెళ్లారు. ఆరోగ్యం బాగాలేదని గదిలోనే విద్యార్థిని ఉండిపోయిందని ఆమె చెప్పారు. దసరా సెలవుల తర్వాత సోమవారం పాఠశాలకు విద్యార్థిని తిరిగి వచ్చిందని తెలిపారు.
ఈ ఘటన జరిగిననంతరం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. సమాచారం తెలిసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ పాఠశాలకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం తమ కుమార్తెకు లేదని.. ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ గది దగ్గర ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయురాలుపై దాడి చేసే పరిస్థితి ఉండటంతో పోలీసులు ఆమెను ఓ గదిలోకి పంపించారు. బంధువులు గది తలుపులు పగులగొట్టి ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, ఆర్డీవో వచ్చారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు.