రథమెక్కి స్టేడియంలో తిరిగిన మోదీ, అల్బనీస్.. కెప్టెన్లతో కలిసి జాతీయ గీతాలాపన - ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ప్రధాని మోదీ
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఇరువురు ప్రధానులు.. ఓ ప్రత్యేకమైన వాహనం ఎక్కిన మోదీ ఆల్బనీస్, స్టేడియంలో కాసేపు తిరిగారు. ఆ తర్వాత తమ జట్టు కెప్టెన్లైన రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు టెస్ట్ క్యాప్‌లను అందజేశారు. భారత్‌కు, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా ఇరు ప్రధానులను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ సన్మానించారు. కాగా, ఆస్టేలియా టీమ్ టాస్‌లో గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ అంటోనీ అల్బనీస్ తమ తమ జట్లతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు.