Ind Vs Pak Asia Cup 2023 : పాక్‌పై భారత్ గెలుపు.. రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్ సంబరాలు.. బాణసంచా కాలుస్తూ.. - ఇండియా వర్సెస్ పాకిస్థాన్ సూపర్ 4
Published : Sep 12, 2023, 10:37 AM IST
Ind Vs Pak Asia Cup 2023 : ఆసియా కప్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన సూపర్ 4 లీగ్‌లో రోహిత్ సేన పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది. రెండు రోజుల పాటు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన భారత జట్టు ఏకంగా 228 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్లు క్రీజులో విజృంభించి పాక్ బౌలర్లకు చుక్కులు చూపించారు. దీంతో పాక్ జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అయితే ఈ గెలుపుతో ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశాలను రోహిత్ సేన గణనీయంగా పెంచుకుంది.
అయితే ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో పాకిస్థాన్‌ను చిత్తు చేయడం పట్ల.. టీమ్ఇండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు చోట్ల సంబరాలు చేసుకున్నారు. యువత రోడ్డుపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. డ్యాన్స్‌లు చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. టీమ్ఇండియా నినాదాలతో వేడుకలు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.