'డబ్బు, మద్యానికి అమ్ముడుపోకుండా ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయండి'
Published : Nov 14, 2023, 6:33 AM IST
Ibrahimpatnam Former MLA Ramulu on Telangana Elections 2023 : ఈ పెద్దాయన పేరు కొండిగారి రాములు. రాజకీయం అంటే డబ్బు ప్రధానం కాదని నిరూపించిన ప్రజాసేవకుడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు.. ఇబ్రహీంపట్నం నియోకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సీపీఎం తరఫున 1989లో 4 వేల ఓట్ల మెజార్టీతో ఓసారి, 1999లో 29 వేల ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. ప్రజల మనసులో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే చెరగని ముద్రను వేసుకున్నారు.
ఎమ్మెల్యే అయితే చాలు.. కోట్లకు పడగెత్తువచ్చనే ఆశలు, ఆరాటాన్ని వదిలేసి.. అతి సాధారణంగా జీవించి చూపించారు రాములు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు, పెద్దయ్యాక పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శాల బాటలో నడిచారు. బీసీ సంక్షేమ శాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగా పనిచేసి.. పేదల పక్షాన నిలబడ్డారు. అధికారుల ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడ్డారు. రాజకీయంగానే కాకుండా కుటుంబపరంగానూ రాములు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. క్యాన్సర్ బారినపడ్డ పెద్ద కుమారుడిని డబ్బు లేక కాపాడు కోలేకపోయారు.
Telangana Assembly Elections 2023 : ప్రస్తుత రాజకీయాలు డబ్బు, మద్యం చుట్టూ తిరుగుతున్నాయని రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేసే నాయకుడ్ని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో 120 గజాల్లోని చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి రాములు జీవిస్తున్నారు. 88 ఏళ్ల వయస్సులో తన పనులు తానే చేసుకుంటూ.. నిత్యం ఉదయపు నడక, వ్యాయామం, పుస్తక పఠనం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న రాములు.. నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.