బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు - పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ న్యూస్
Published : Dec 18, 2023, 7:00 PM IST
Hyderabad Police Case Filed on Bigg Boss 7 Winner Pallavi Prashanth :తెలుగు పాపులారిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, బిగ్‌బాస్ 7 ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య వివాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్, రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్ నుంచి బయటకు రావటంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై గొడవ చెలరేగింది. పలువురు రెచ్చిపోయి అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు.
ఈ క్రమంలోనే దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా నమోదు చేశారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గజ్వేల్ పట్టణంలో సందడి చేశారు. బిగ్ బాస్ షోలో ఆదివారం రాత్రి విన్నర్‌గా ప్రకటించిన అనంతరం ఆయన స్వగ్రామం గజ్వేల్ మండలం కొల్గుర్‌కు వస్తుండగా, ప్రజ్ఞాపూర్‌లో ఆయనకు స్నేహితులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు యువకులు డీజే సౌండ్ల మధ్య భారీ ర్యాలీని నిర్వహించారు. అభిమానులు, యువకులు పల్లవి ప్రశాంత్‌తో సెల్ఫీలు, కరాచలనం చేస్తూ సందడి చేశారు. అభిమానంతో స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభివాదం చేశారు.